Search
Close this search box.
Play Video about సంఘానికి దేవుడిచ్చిన ఆత్మీయ వరాలు

ఒక రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తికి భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలిసే వరం ఉండేదట. ఒకరోజు, ఆ రాజ్యాన్ని ఏలుతున్న రాజు గారి గుర్రం చనిపోతుందని ప్రవచించాడు. ఆ గుర్రం నిజంగానే చనిపోయింది. రాజుకు చాలా కోపం వేసి ఆ వ్యక్తిని పిలిపించాడు. రాజు ఆ వ్యక్తితో “నీకు అన్నీ ముందే తెలుస్తాయి కదా, నువ్వెప్పుడు చావబోతున్నావో చెప్పు?” అన్నాడట. తనకు చావు ఖాయం అని ఈ వ్యక్తికి అర్థం అయ్యింది. తెలివిగా ఇలా చెప్పాడు “రాజా, నా చావెప్పుడో నాకు తెలియదు కానీ, ఇది మాత్రం నాకు తెలుసు : నేను చావగానే మూడు రోజుల తర్వాత రాజైన మీరు కూడా చస్తారు”.

ఎఫెసీ 4:7-10 అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను. 8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది. 9 ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నదిగదా. 10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.

గత ప్రసంగంలో మనం దేవుడు ఐక్యతను కోరుతున్నాడని ఆ ఐక్యతను కాపాడడానికి మనం కలిగుండాల్సిన లక్షణాలను గురించి మాట్లాడుకున్నాం. ఐక్యతకు మూలంగా 7 విషయాలను కూడా మనం విన్నాం.
వివిధ నేపథ్యాలు, ప్రాంతాల నుండి వచ్చినా విశ్వాసులు అందరూ కూడా క్రీస్తులో ఒక్కటే. సంఘం ఐక్య సహవాసం అని చూశాం.

ఈరోజు మరో ముఖ్యమైన సంగతి మనం మాట్లాడుకుందాం. సంఘానికి దేవుడు వివిధ రకాలైన ఆత్మీయవరాలు ఇస్తాడు. ఒక్కడే దేవుడు, ఒక్కటే సంఘము, కానీ సంఘములో గల వ్యక్తులకు వేర్వేరు వరాలు దేవుడు ఇస్తాడు – unity in diversity in gifts.

నా ప్రసంగానికి నేనిచ్చిన పేరు : దేవుడు సంఘానికి ఇచ్చిన ఆత్మీయ వరాలు.

I. ఆత్మీయ వరాలకు మూలం దేవుడే

వ7 : అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.

దేవుడే విశ్వాసులకు ఆత్మీయవరాలను దయచేస్తాడు. తనంతట తానే ఏ వ్యక్తి వరాలు సంపాదించుకోలేడు, మరే వ్యక్తికూడా ఒకరికి ఆత్మీయ వరాలు దయచేయలేడు. దేవుడు మాత్రమే ఈ వరాలను ఇస్తాడు.

ఎలా ఇస్తాడు?
కృప ద్వారా, క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున దేవుడు ఇచ్చాడు. కృపద్వారా (charis) రక్షించబడిన విశ్వాసులకు మాత్రమే కృప ద్వారా దేవుడు ఆత్మీయ
వరాలను దయచేస్తాడు. ఇక్కడ కృప రక్షించే కృప కాదు, పరిచర్య సంబంధమైన కృప.
3:7 దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
ఆత్మీయ వరాలు వ్యక్తిని రక్షించలేవు, కేవలం దేవుని కృప మాత్రమే ఒక వ్యక్తిని రక్షించగలదు. “ఈ వరములు విశ్వాసుల క్రియలు లేదా యోగ్యతపై ఆధారపడవు గాని; క్రీస్తు వరము యొక్క పరిమాణము ప్రకారము ఉన్నవి.” క్రీస్తు తన శరీరములోని ప్రతి అవయవమునకు కృపతోను, సార్వభౌమత్వముతోను వరములను పంచిపెట్టును.(ESV ఎక్స్ ‌ పోజిటరీ వ్యాఖ్యానం నుండి సారాంశం: ఎఫెసీయులు-ఫిలేమోన్, క్రాస్ వే)

ఇది వివరించడానికి, పౌలు కీర్తన 68 ఇక్కడ ఉటంకిస్తాడు. 17,18 వచనాలు గమనిస్తే, దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టబడినవారిని చెరపట్టుకునిపోతివి. మనుష్యల చేత నీవు కానుకలు తీసుకొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాస ఘాతకుల
చేత సహితం నీవు కానుకలు తీసుకొనియున్నావు.

పీటర్ ఓ బ్రయాన్ (ఎఫెసీ కామెంటరీ,288) : 68 కీర్తన దాని సందర్భం గమనిస్తే,ఈ కీర్తన దేవుణ్ణి తన ప్రజలను కాపాడడానికి పిలిచే ప్రార్థనగా ఉంది (1-3), దేవుడు చేసిన కార్యాలను బట్టి, తీసుకొచ్చిన విడుదలను బట్టి స్తుతించబడాలి (4-6). నిర్గమం (బానిసత్వం నుండి విడుదల) తర్వాత వారిముందు విజయుడిగా దేవుడున్నాడు (7), అప్పుడు భూమి వణికింది (8), రాజులు చెదిరిపోయారు (11-14), దేవుడు సీనాయి కొండను తన నివాసంగా చేసుకోడానికి ఇష్టపడ్డాడు (16). అందువల్ల, నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి (18).

ఇది యుద్ధంలో విజయుడైన రాజు తన రాజ్యానికి వచ్చినప్పుడు ఉండే చిత్రాన్ని సూచిస్తుందని మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు చెబుతారు.

యెహోవా దేవుడిని ఉద్దేశించి, దేవుడు చేసిన పనిని ఉద్దేశించి రాసిన కీర్తనను, క్రీస్తుకు పౌలు అన్వయిస్తున్నాడు.

అపొస్తలుల కార్యములు మొదటి  అధ్యాయంలో యేసు తన పునరుత్థానం తరువాత పరలోకానికి ఆరోహణమయ్యాడని మనందరికీ తెలుసు.

”అతడు చెరను చెరగా పట్టుకొనిపోయెను” అంటే అర్థమేమిటి?

యేసు సాతాను మరియు దుష్ట శక్తులతో యుద్ధంలో గెలిచాడని దీనర్థము.

అయితే కీర్తన 68లో నీవు కానుకలు తీసుకొనియున్నావు అని ఉంది. ఇక్కడ కానుకలు పంచిపెట్టాడు అని ఉంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలి?

దీని మీద ఎన్నో రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ నేను హెండ్రిక్సన్ అనే బైబిల్ కామెంటేటర్ రాసిన వ్యాఖ్యానంతో సమ్మతిస్తాను : పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు క్రింద అపొస్తలుడు ఈ అన్వయింపు చేయుటకు ప్రతి హక్కును కలిగియుండెను,

ఏలయనగా జయించువాడు దోపుడుసొమ్మును ఇచ్చివేసే ఉద్దేశ్యముతో వాటిని తీసుకుంటాడు. ఇవ్వడం అనేది తీసుకోవడంలో ఇమిడియుంది లేదా సూచించబడింది.

క్రీస్తు ఆరోహణమైనప్పుడు అతడు ఖాళీ చేతులతో పరలోకమునకు తిరిగి వెళ్లలేడు. తాను చేసిన మధ్యవర్తిత్వ పని ఫలితంగా, తన ప్రజల రక్షణను గెలిచ, విజయంతో పరలోకానికి తిరిగి వచ్చాడు.పౌలు, కొన్నిసార్లు పాత నిబంధన యొక్క ఖచ్చితమైన మాటలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడు, కానీ దాని యొక్క మూలాంశమును తన సొంత భాషలో తెలియజేయునని పేర్కొన్నాడు. (కాల్విన్ యొక్క వ్యాఖ్యానాలు [బేకర్], ఎఫె. 4:8, p. 273)

పౌలు కీర్తనలోని ఒక నిర్దిష్ట వచనాన్ని చెప్పడం లేదని అనుకోవడం మంచిది, కీర్తన 68:18 వంటి వాక్యాలున్న ఆ కీర్తన మొత్తం సారాంశాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. (హెరాల్డ్ హోనర్,634 వ పేజీ బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ)

ఆ తర్వాత, పౌలు వ9 లో “ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నదిగదా” అని చెబుతాడు.

ఇక్కడ కొందరు, యేసు క్రీస్తు మరణించినప్పుడు, తన పునరుత్థానానికి ముందు, ఆయన ఆత్మ పాతాళానికి వెళ్లి సాతాను మీద తన విజయాన్ని ప్రకటించాడు అని నమ్ముతారు.

దీనికి వారు చూపించే వాక్యం 1పేతురు 3:20 – దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.

 

మరికొందరు, ఆయన మొదట పరలోకం నుండి కిందికి శరీరధారిగా రావడమే ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. యోహాను 3:13లో నికోదేముతో “మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.”

“ఈ దృక్పథంలో దిగువ ప్రాంతాలు భూమి యొక్క దిగువ భాగములు కాదుగానీ విశ్వము యొక్క దిగువ భాగములు, అనగా రచయిత భూమికి దిగిరావడం గూర్చి మాట్లాడుచున్నాడు” (లింకన్, 245).

మరికొందరు, యేసు దిగిరావడం పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దిగిరావడం అని అంటారు.

ఇక్కడ పౌలు ప్రధాన వాదన ఆయన దిగిరావడం అనే విషయం మీద కన్నా, ఆయన ఆరోహణం గురించి అని మనం మర్చిపోవద్దు.

ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే, సాతానుపై విజయం సాధించిన తరువాత, యేసు పరలోకమునకు ఆరోహణమయ్యాడు, పరిశుద్ధాత్మ వరమును మరియు అతనితో కూడా ఆత్మీయ వరములన్నీ ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి దయచేశాడు.

కాబట్టి, దేవుణ్ణి వరాలకు మూలంగా మరియు వరములు ఇచ్చువానిగా, పౌలు పునాది వేస్తున్నాడు.

  1. ఆత్మీయవరాలు ప్రతి ఒక్కరికీ దేవుడు దయచేస్తాడు

ఎఫెసీ 4:7-10 అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.

ఇక్కడ “ప్రతివానికి” అంటే “తన కృపచేత రక్షింపబడిన క్రీస్తు దేహములోని ప్రతి అవయవము” అని అర్థము. అంటే సంఘములోని ప్రతి విశ్వాసికి అని అర్థం.

క్రీస్తును విశ్వసించిన ప్రతి విశ్వాసి ఆత్మసంబంధమైన వరమును పొందుకుంటాడు.

కొంతమంది విశ్వాసులు ఒకటి కంటే ఎక్కువ ఆత్మీయ వరాలను పొందుకుంటారు.

ఇదే ఆత్మీయవరాలకు సంబంధించిన వేరే వచనాలు కూడా మనం చూద్దాం.

రోమా 12:3 – తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము

1పేతురు 4:10 –దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.

1 కొరింథీ 12:11 – అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

ఇక్కడ మూడు విషయాలు: 

1. ఆత్మీయ వరాలు, మన ప్రతిభాపాటవాలకు వేరైనవి. Spiritual gifts are different from Talents.

ఉదా : driving, cleaning కొందరు చక్కగా చేస్తారు అది వారి తలాంతు. కొందరు కవితలు రాస్తారు,కొందరు భలే మాట్లాడతారు. ఇవి అవిశ్వాసుల్లో కూడా మనం చూడొచ్చు. సాధారణ కృపలో (common grace) లో దేవుడిస్తాడు.

ఇక్కడ ప్రస్తావించిన వరాలు, కృప ద్వారా రక్షించబడిన విశ్వాసులకు,పరిశుద్ధాత్మ దేవుడు దయచేసే ఆత్మీయ వరాలు.

ఉదా : 1 కొరింథీ 12:8-10 : ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.

2. ఆత్మీయ వరాలు విభిన్నమైనవి. There are varieties of ministries. (1 కొరింథీ 12, రోమా 12, 1పేతురు 4:10,11)

రోమా 12:6-8 – మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, 7 ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము;పరిచర్యయైతే పరిచర్యలోను, 8 బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

3. ఆత్మీయ వరాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. For the edification of the church – 1 కొరింథీ 12:7 ప్రకారం “అందరి ప్రయోజనం కొరకు” ఇస్తాడు.

 

అన్వయింపు :

  1. పాపం మరియు సాతానుపై విజయం సాధించి, బందిఖానా నుండి మనలను విడిపించిన యేసుక్రీస్తు మరణం మరియు పునరుత్థానాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుదాం.

ఆయన చెరను, చెరగా పట్టుకుపోయినందుకు కృతజ్ఞత కలిగియుందాం.

విజయుడిగా మరణం నుండి లేచి మనల్ని విజయవంతులుగా చేసినందుకు వందనాలు చెబుదాం.

ఇక్కడ ఇంకా ఎవరైనా క్రీస్తును విశ్వసించకపోతే, మీరింకా సాతాను కబంధ హస్తాల్లో బందీలుగా ఉన్నారని, వాడు మిమ్మల్ని తన చెరలోకి తీసుకెళ్తున్నాడని గుర్తుచేస్తున్నాను.

వాడి చెరలో ఉండడం అంటే నరకంలో నలిగిపోవడమే, నశించిపోవడమే.

కానీ, ఆ చెర నుండి నిన్ను విడిపించడానికి క్రీస్తు పరలోకం నుండి వచ్చాడు, సిలువలో మరణించాడు, మరణం గెలిచి లేచాడు, ఆయన్ను విశ్వసించిన వారిని విడిపించి చెరను చెరపట్టుకుని ఆరోహణుడై పరలోకానికి వెళ్లాడు.

ఇంకెన్నాళ్లు సాతాను చెరలో ఉంటావు? ఈ రోజే ప్రభువును నమ్ముకో,నీకు విడుదల నిచ్చి నిత్యజీవం క్రీస్తు ఇస్తాడు.

 

  1. క్రైస్తవుడు స్థానిక సంఘముకు కట్టుబడి ఉండాలి, ఎందుకు? ఎందుకంటే,అక్కడ దేవుడిచ్చిన వరాలను పాటించడానికి. సంఘానికి అంటుకట్టబడకుండా, నీ వరాలను ఎలా వాడతావు?  ఆదివారం మాత్రమే హాజరై, మీ వరాలను సంఘ క్షేమం కోసం వాడకపోతే మీరు మీ జీవితం కొరకు క్రీస్తు ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం లేదు అని స్టీవెన్ కోల్ గారు చెబుతారు.

మీరు సంఘ మీటింగ్స్ కి రాకపోవడం, ఆదివారం సంఘంతో కలిసి ఆరాధించడానికి రాకపోవడం వలన ఏం జరుగుతుందో మీలో చాలా మందికి తెలియదు.

ఏమైతుందో తెలుసా? సంఘానికి క్షేమాన్నిచ్చే వరం వాడబడట్లేదు, అందువల్ల సంఘం ఆరోగ్యంగా ఎదగట్లేదు.

ఉదా : ఆదివారం సంగీతం వాయించే వారు లేకపోతే, మనం పాటలు పాడతాం కానీ, అది సంగీతంతో పాడే దాని కన్నా కాస్త తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.

 

  1. ఆత్మీయవరాలు ఇచ్చువాడు దేవుడు కాబట్టి, మన ఆత్మీయ వరాల గూర్చి మనం అతిశయించకూడదు. మనం దేవుని కృప చేత వాటిని పొందుకున్నాము.

మనం వాటిని కష్టపడి సంపాదించలేదు. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు.

ఇతరులకు సేవ చేసినప్పుడు, ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఉదారంగా సాయం చేసినప్పుడు మనం గర్వించకూడదు.

ఈ వరం మనం దేవుని నుండి పొందుకున్నాము. దేవుడిచ్చిన ఈ వరాలను వినయంతో అంగీకరించుదుము గాక.

 

  1. ఆత్మీయవరాలు ఇచ్చేది దేవుడే కాబట్టి, ఆ వరాలను సంఘ ప్రయోజనం కోసం వాడుదాం.

ఇక్కడ రెండు విషయాలు :

1.కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వరాలను వాడుకోవాలని, క్రెడిట్ పొందుకోవాలని చేయొచ్చు.

2.ఇంకొందరు అసలు వాడకుండా ఉండొచ్చు.

 

మనందరం విన్నాం : మత్తయి 25లో, ఒక తలాంతును దేనికీ వాడకుండా పెట్టిన వ్యక్తిలా మనం ఉండకూడదు. దేవుడిచ్చిన వరాలను మరింతగా దేవుని సంఘం కొరకు మనం వాడాల్సినవారమైయున్నాము.

అసలు ఆ వరం ఏమిటో నాకు తెలియదు అనుకుంటే, నీ భార్యనడుగు, నీ భర్తనడుగు,సంఘ సభ్యుణ్ణి అడుగు.

నీ ఆత్మీయవరం ఏమిటో నీకు తెలిస్తే, నాయకత్వం దగ్గరికి వచ్చి, నేను సంఘ క్షేమం కోసం ఏ విధంగా వాడబడగలనో చెప్పండి అని అడగండి. ఎప్పుడూ తీసుకునే స్థానంలోనే ఉండకండి, ఇచ్చే స్థానానికి రండి.

మీ వరాలను స్థానిక సంఘ క్షేమం కొరకు వాడేలా సహాయం చేయమని దేవుణ్ణి అడగండి.

  1. ఆరోహణం అవ్వడం ఆత్మీయ వరాలను దయచేయడం యొక్క లక్ష్యం, సమస్తాన్ని నింపడం

10వ : దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు

1:23 – ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

సమస్తము మీద తన దైవిక ప్రభుత్వాన్ని సాధకము చేయుట ద్వారా క్రీస్తు విశ్వమంతటిని నింపుతాడు.

ఎప్పడు? ఇప్పుడు మరియు ఇకముందు.

అయన ప్రభుత్వాన్ని అంగీకరించావా?

  1. ప్రభువు నీకిచ్చిన ఆత్మీయ వరం గుర్తించావా? ఏమిటని నువ్వనుకుంటున్నావు? సంఘ ప్రయోజనం కోసం నీ వరాలను వాడుతున్నావా?
  2. ఆత్మీయవరాలు సంఘ క్షేమం కోసం వాడకపోతే జరిగేది ఏమిటి?