Search
Close this search box.
Play Video
  1. ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిచయం

రచయిత : అపొస్తలుడైన పౌలు (1:1), మీ నిమిత్తము క్రీస్తు యేసుయొక్క ఖైదీనైన పౌలను నేను (3:1).

ఎఫెసీ 6:21 మీరును నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియసహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియ జేయును.

22 మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని.

ఎఫెసీ పత్రికను సంఘముకు తుకికు ద్వారా పంపాడని మనం అర్థం చేసుకోవచ్చు.

సమయం : AD 60-62

ప్రదేశం : రోమా కారాగారం – ఈ పుస్తకాన్ని జైలు ఉత్తరం అని కూడా అంటారు. ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు, ఎఫెసీయులకు, ఫిలేమోనుకు రాసిన పత్రికలను జైలు పత్రికలు అంటారు.

అపొస్త 28:16 –  మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి యున్న సైనికులతో కూడ ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను.

వ 30 -పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అప్పటికే శరీర సంబంధ ఇబ్బందులు,వ్యాధులు అనుభవిస్తూ ఉన్న వ్యక్తి పౌలు. ఒక పట్టణం నుండి మరో పట్టణానికి నడుస్తూ, ఓడలో ప్రయాణం చేస్తూ విస్తారమైన పరిచర్య చేసిన వ్యక్తి ఈ పౌలు.

ఇప్పుడు రోమా కారాగారంలో,చీకటిలో బంధించబడ్డాడు.

సాధారణంగా ఇటువంటి స్థితిలో దేవుణ్ణి నిందించాలి లేదా ఇక నా జీవితం ఇంతే అని సర్ది చెప్పుకోవాలి లేదా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ గడపాలి.

కానీ, ఈ వ్యక్తి మరో అడుగు ముందుకేసి, తన శ్రమలను లెక్కచేయకుండా, సంఘాలను అంటే విశ్వాసులను ప్రోత్సహించడానికి, సరిదిద్దడానికి ఆ జైలు నుండి ఉత్తరాలు రాస్తున్నాడు.

అంటే, ఆ పరిస్థితుల్లో సైతం ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు.

పరిస్థితులు అన్నీ అనుకూలంగా బాగున్నపుడు మాత్రమే కాదు, ప్రతికూల సమయాల్లో సైతం ప్రభువు సంఘమును గూర్చి ఆలోచన కలిగి, ఆచరణలో ముందుకెళ్లాలనే  పాఠం పౌలు నేర్పుతున్నాడు.

ఎఫెసీ పట్టణం : ఎఫెసీ పట్టణం ఒక పురాతన ఓడరేవు నగరం. దీని శిధిలాలు ఆధునిక టర్కీలో ఉన్నాయి. ఈ నగరం ఒకప్పుడు అత్యంత ముఖ్యమైన గ్రీకు నగరంగా మరియు మధ్యధరా ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా పరిగణించబడింది.

అర్తిమయ దేవి ఆలయం ఈ పట్టణంలో ప్రసిద్ధి. ఈ అర్తిమయ దేవిని అరణ్య దేవతగా, పిల్లలను ప్రసాదించే దేవతగా పూజించేవారు.

అప్పట్లో ఈ ఆలయం ప్రపంచంలో గల అద్భుత కట్టడాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

ఎఫెసీ పట్టణంలో భూతవైద్యం మరియు అన్ని రకాల మాయా కళలకు ప్రధాన స్థానం ఉండేది. ముందు ముందు ఆ విషయం కూడా మనం చూస్తాము.

శ్రోతలు : ఎఫెసీలో గల విశ్వాసులు. ఈ విశ్వాసులు ఎక్కువగా అన్య జనులు. అంటే యూదేతరులు. అందుకే వీరిని సున్నతిలేని వారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేని వారు, వాగ్దానాలు లేని వారు, క్రీస్తుకు దూరంగా ఉన్నవారు అని పౌలు సంబోధిస్తాడు (2:11-13).

ఎఫెసీ పట్టణంలో పౌలు :

అపొస్త 16:6,7 -ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.

ఆసియాకు వెళ్లకుండా ఆత్మ దేవుడు అడ్డుకున్నాడు.

ఆ పిదప అపోస్త 19 వ అధ్యాయంలో పౌలు ఆసియాలో అడుగు పెట్టడం మనం చదువుతాం. .

వ1 -పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి. కొరింథు నుండి ఎఫెసీ పట్టణానికి పౌలు వచ్చాడు.

1-7 వచనాలు చూస్తే 12 మంది పురుషులు బాప్తీస్మము పొందారు. ఆ తర్వాత తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసం గించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను (8వచనం).

ఎన్నిరోజులు పౌలు అక్కడ ఉన్నాడు ? వ 10- రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.

ఆ పిదప మనం చూస్తే ఎఫెసీ పట్టణంలో 11-దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;

12 అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.

దేవుడు పౌలు ద్వారా అద్భుతాలు కూడా చేయించాడు. దేవుడు చేయిస్తాడు అప్పుడు ఇప్పుడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు.

ఇక్కడ మరో అద్భుతం జరిగింది : పౌలు ద్వారా దయ్యములు వెళ్లిపోవడం చూసి అక్కడ గల మాంత్రికులు యేసు పేరు మీద మేము మంత్రిస్తాము అని దయ్యములు పట్టిన వాడితో యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకున్నారు. ఎవరు వీరు ? యూదుడైన స్కెవ కుమారులు.

అప్పుడు ఆ దయ్యం ఇలా అన్నది వ15 -నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా.

అంటే దయ్యాలకు కూడా క్రీస్తు ఎవరో తెలుసు, క్రీస్తు నిజ శిష్యులు ఎవరో తెలుసు.

మీకో విషయం చెప్పనా ? చాలా మంది సంఘానికి వెళ్తున్న వస్తున్న వారికి క్రీస్తు ఎవరో తెలియదు, క్రీస్తు శిష్యులుగా ఉండడం అంటే ఏమిటో తెలియదు.

17-20 : ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘన పరచబడెను.

18 విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.

19 మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.

అంటే అర్థమేమిటి? వారు తమ మారుమనస్సు పొందడమే కాదు,వారి పాత పద్ధతులు పుస్తకాలు కాల్చేశారు.

క్రైస్తవులు చాలా మంది, ఇంకా తమ పాత పద్ధతులు పట్టుకొని వేలాడుతున్నారు.

ఇంకా వాస్తు చూస్తున్నారు క్రైస్తవులు, ఇంకా కొత్తింట్లో పాలు పొంగిస్తున్నారు,ఇంకా పిల్లలకు దిష్టిచుక్కలు పెడుతున్నారు, ఇంకా మంచి రోజులను చూసి పెళ్లిళ్లకు ముహుర్తాలు పెట్టుకుంటున్నారు.

పాత పద్ధతులు సమాధి చెయ్యట్లేదు. వాటితోనే సంఘానికి వస్తున్నారు.

20 ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.

ఇక్కడ ఒక విషయం గమనించండి : మాంత్రిక విద్యలు, దయ్యములు ఒకవైపు, దేవుని సువార్త ఒకవైపు. ఏమి జరిగింది ?

వాక్యమే గెలిచింది.

ఎక్కడ దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తుందో అక్కడే దేవుని శక్తి విస్తరించబడుతుంది.

అబ్బా ప్రభువు సువార్త పని జరిగింది, బాప్తీస్మములు జరిగాయి, అద్భుతాలు చేశాడు, దయ్యాలు వెళ్లిపోయాయి, ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను అనుకోవచ్చు.

కానీ, ఆ తర్వాత దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించేవాడట. చాల మంది క్రీస్తును నమ్ముకోవడం ద్వారా ఆయన వ్యాపారానికి దెబ్బ తగలడంతో చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెపుతున్నాడు, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూస్తున్నారు.

27 మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంత టను భూలోకమందును పూజింపబడుచున్న ఈమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను.

అసలు కారణం, తన గల్లా పెట్టెలో కాసులు తగ్గిపోవడమే.

అప్పుడు అక్కడ పెద్ద అల్లరి చెలరేగింది. ఎవరు ఎం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. పౌలును అక్కడ దాదాపు కొట్టేవారే. కానీ అక్కడ గల కరణము అంటే ఓ పెద్దాయన అందర్నీ సముదాయించి పంపేశాడు.

దాదాపు 2-3 సంవత్సరాలు పౌలు అక్కడ ఉన్నాడు. (Acts 20:31).  పౌలు తన మిషనరీ ప్రయాణాల్లో అతి ఎక్కువ కాలం ఉన్నది ఎఫెసు లోనే.

దేవుని సువార్త, దేవుని పని జరుగుతున్నపుడు ఆ ప్రభావం చుట్టు పక్కల వారి మీద ఉంటది. వారికి అది కేవలం వారి ఆర్ధిక పరిస్థితి మీద దెబ్బకొట్టే సందేశంగా కనిపించొచ్చు కానీ, ఈ సువార్త వారి నిత్యత్వానికి సంబంధించి అని కొంత మందే గ్రహిస్తారు.

ఇదంతా మీకెందుకు చెప్పాలి అంటే ఎఫెసీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తున్నాడు. ఆ పట్టణంలో జరిగిన సంగతులు, ఆ చారిత్రక నేపథ్యం ముందు ముందు మనం వినే వివరణాత్మక బోధను చక్కగా అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతుంది.

పుస్తక పరిచయం : ఈ పుస్తకములో మొత్తం 6 అధ్యాయాలు ఉన్నాయి. 155 వచనాలు ఉన్నాయి.

ఎఫెసీ విశ్వాసుల విశ్వాసాన్ని బలపరచడానికి, వారి ఐక్యతను పెంపొందించడానికి మరియు పవిత్రతకు వారిని ప్రోత్సహించడానికి పౌలు ఈ ఉత్తరం రాసాడు.

మొదటి అధ్యాయంలో రక్షణ విషయంలో దేవుని ప్రణాళిక, కుమారుని విమోచన, పరిశుద్ధాత్మ ముద్ర గురించి రాయబడ్డాయి. అంటే త్రిత్వమైన దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తాం.

రెండవ అధ్యాయంలో క్రీస్తుని విశ్వసించకముందు మనిషి పతనావస్థ, క్రీస్తు కృపా కార్యము మరియు క్రీస్తు సిలువ ద్వారా అన్యులు కూడా సంఘమనే దేవుని ఆలయంలో ఎలా కట్టబడతారు అనే సంగతులు రాయబడ్డాయి. అనగా, రక్షణ సిద్ధాంతము మరియు సంఘ సిద్ధాంతము ఈ అధ్యాయంలో మనం చూస్తాము.

మూడవ అధ్యాయంలో సంఘము పట్ల క్రీస్తు ప్రేమ యొక్క లోతైన సంగతులను మరియు సంఘము పట్ల తన ప్రార్థనను పౌలు రాస్తాడు.

నాలుగవ అధ్యాయంలో సంఘములో ఐక్యత కలిగి యుండుట, సంఘములో ఏ విధంగా మనం నడుచుకోవాలి అంటే సంఘ విశ్వాసులతో మనం ఎలా ఉండాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఎవరిని నియమించాడు అనే సంగతులు మనం చదువుతాం.

అయిదు, ఆరు అధ్యాయాలలో వ్యక్తిగతంగా ఎలా పవిత్రతలో ప్రేమలో జీవించాలి, ఆత్మపూర్ణులుగా బ్రతకాలి, భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు,  దాసులు, యజమానులు ఎలా ప్రవర్తించాలి అని చెప్పి మనం దేవుని సర్వాంగ కవచము ధరించుకొని అపవాదితో పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రోత్సహిస్తాడు. చివరలో ప్రార్థన యొక్క ఆవశ్యకతను చెప్పి ఆశీర్వాదం (బెనెడిక్షన్)ఇచ్చి తన మాటలు ముగిస్తాడు.

మొదటి మూడు అధ్యాయాలు సిద్ధాంతాన్ని బోధిస్తే, చివరి మూడు అధ్యాయాలు సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి జీవించాల్సిన విషయాలను గూర్చి బోధిస్తాయి.

కాలేజీలో క్లాస్ రూముల్లో సబ్జెక్టు బోధిస్తారు. ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చూపిస్తారు. సబ్జెక్టు వినకుండా, అర్థం చేసుకోకుండా డైరెక్ట్ ప్రాక్టికల్స్ చేయలేము. అందుకే థియరీ చాలా ముఖ్యం. అప్పుడే ప్రాక్టికల్స్ చేయగలం. పౌలు కూడా అదే విధంగా క్రైస్తవ జీవితానికి అవసరమైన థియరీ (సిద్ధాంతం – Doctrine ) చెప్పిన తర్వాత పాటించాల్సిన ఆజ్ఞలను చెబుతాడు.

ఈ మాట వినండి, మనం దేవుడు ఎవరో, క్రీస్తు ఏమై యున్నాడో, ఆయన ఎందుకు చనిపోయాడో, పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేస్తున్నాడో, చేస్తాడో, ఈ త్రియేక దేవుడు రక్షణ ద్వారా మనకు అనుగ్రహించిన విలువైన విషయాలు ఏమిటో వాక్యానుసారంగా మనకు అర్థం కాకపొతే చివరి మూడు అధ్యాయాలలో చెప్పబడిన ఆజ్ఞలు మనం పాటించడం చాలా కష్టం.

ఎందుకు సంఘములో ఐక్యత కొరవడుతోంది ? ఎందుకు సంఘములో వాక్య విరుద్ధ భేదాభిప్రాయాలు ఉంటున్నాయి ? ఎందుకు కుటుంబాలు దేవుని వాక్య ప్రకారం ఉండట్లేదు ? ఎందుకు క్రైస్తవులు సాతానుతో పోరాడలేక పోతున్నారు ?

ఎందుకంటే మొదటి మూడు అధ్యాయాలలో చెప్పబడిన విషయాలు మన హృదయాలలోకి ఇంకలేదు. ఇంకుడు గుంత గురించి మీరు వినే ఉంటారు. ఇంటిచుట్టు ఉండే నీరు వృధా కాకుండా ఇంటి కార్నర్ లో ఒక గుంత తవ్వి అక్కడ ఆ నీటిని నిలువ చేస్తారు. అది కాస్త లోతుగా తవ్వుతారు.

మన హృదయంలోకి అంటే అంతరంగంలోకి  దేవుని మాటలను లోతుగా తీసుకెళ్లకపోతే, ఆ వాక్యాన్ని మన అంతరంగమును మార్చే విధంగా అనుమతి మనం ఇవ్వకపోతే, దేవునిపై ఆధారపడుతూ ఆ వాక్యమును పాటించుటకు మనం ప్రయత్నం చేయకపోతే మన జీవితాల్లో మార్పు ఏమీ జరగదు.

“పీటర్ ఓ’బ్రయన్ ఇలా అంటాడు, ” ఎఫెసీయులకు రాసిన పత్రిక  ఇప్పటివరకు వ్రాయబడిన అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి.”

(ESV ఎక్స్‌పోజిటరీ కామెంటరీ: ఎఫెసియన్స్–ఫిలేమోన్ crossway).

జాన్ స్టాట్ : ఎఫెసీ పత్రిక సంఘానికి సువార్త వంటిది.

ఈ పత్రిక జాన్ కాల్విన్ కి ఇష్టమైన పత్రిక.

విలియం బార్క్లే – లేఖనాలకు రాణి లాంటిది.