Search
Close this search box.
Play Video

దేవుని ఆశీర్వాదం – కుమారుని విమోచన, పరిశుద్ధాత్మ ముద్రణ (Ephesians 1:7-14)

7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

8 కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

9 మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.

10 ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.

11 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,

12 దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.

13 మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

దేవుని ఆశీర్వాదముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు.

ఏమిటా ఆశీర్వాదములు ?

జగత్తు పునాదికి ముందే మనలను ఎన్నుకోవడం, మనలను తన కుమారులుగా,కుమార్తెలుగా చేసుకోవడం.

ఎందుకు చేశాడు ?

తన ప్రేమను బట్టి, తన సార్వభౌమ సంకల్పాన్ని బట్టి.

తండ్రియైన దేవుని గూర్చిన ప్రేమ గొప్పతనం అధికారం మనకు ఇప్పటివరకు అర్థం అయ్యింది.

ఆ తర్వాత తండ్రియైన దేవుడు మనకిచ్చిన మరో ఆశీర్వాదం గూర్చి పౌలు వివరిస్తున్నాడు.

తండ్రియైన దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం కుమారుడే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు.

తన ప్రియుడైన యేసు క్రీస్తు ద్వారా తండ్రియైన దేవుడు తన ప్రజలకు దయచేసిన మూడు ఆశీర్వాదాలను నేను మీకు పరిచయం చేస్తాను.

  1. A. యేసుక్రీస్తు ద్వారా మనకు లభించింది ఏమిటి ?

 

7 వ : దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

ఈ వచనాన్ని గత సందేశంలో కూడా నేను ప్రస్తావించాను. అయితే వాక్యభాగం విభజన చేసినప్పుడు ఈ వచనం ఈ సందేశంలో ఉంటేనే సబబు అనిపించింది.

 

విమోచనము ( REDEMPTION ).

విమోచనము అనగా ” బానిసత్వం నుండి, ఖైదు నుండి విడుదల” చెందించడం.

ఈ విమోచనము అనే భావన పాత నిబంధన నుండే మనం చూడగలం. బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించిన విధానము అలాంటిదే.

ద్వితియో 7:8 – అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబల ముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.

రోమా 3:24 – కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.

1 కొరింథీ 1:31 -దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

ఎలా విడిపించాడు ?

క్రీస్తు రక్తం చిందించి, వెల చెల్లించి విడుదల దయచేశాడు.

విడుదల కోసం వెల చెల్లించాల్సిన అవసరం ఉండేది.

బానిసను విడిపించాలంటే వెల చెల్లించకుండా జరిగేది కాదు.

మొదటి శతాబ్దంలో ఉన్న వారికి విమోచనము అనే మాట చక్కగా అర్థమయ్యుంటుంది. ఎందుకంటే దాదాపు 6 కోట్ల మంది రోమా సామ్రాజ్యంలో బానిసలు ఉండేవారట. ఈ బానిసల్లో చాలామంది క్రీస్తును నమ్ముకున్నారు. వారు బానిసత్వం నుండి బయటపడాలంటే యజమానికి తగిన డబ్బులు చెల్లించాలి. లేదంటే ఎవరైనా ఆ యజమానికి డబ్బులు చెల్లించి ఆ బానిసను విడిపించాలి. 

బానిసత్వం నుండి విడిపించబడటం అంటే ఏమిటో వారికి బాగా తెలుసు.

1 కొరింథీ 7:23 – మీరు విలువపెట్టి కొనబడినవారు.

ఎందుకు చేశాడు ? మనం మన స్వశక్తితో విడుదల చేసుకోలేము కాబట్టి.

మన అపరాధములకు క్షమాపణ కూడా క్రీస్తు దయచేశాడు. ఈ రెండూ ఒకేసారి జరిగేవి.

తీతుకు 2:14 – ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

మన అపరాధములకు క్షమాపణనివ్వడానికే క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు, విడుదల ప్రసాదించాడు.

  1. యేసు క్రీస్తు ద్వారా తండ్రి దయచేసిన మరో ఆశీర్వాదం విస్తారమైన కృప

V9 – రక్షించబడిన తన ప్రజలయెడల తన కృపను విస్తారంగా చూపించాడు. HE LAVISHED UPON US.

కృప అంటేనే అర్హత లేని వారికి దేవుడిచ్చే బహుమానం.

బహుమానం మనము సంపాదించుకోలేనిది, డిమాండ్ చేయనిది.

ఎలా ఇచ్చాడు ? విస్తారంగా ఇచ్చాడు. ఎంత విస్తారమైన కృప అది ? కుమారున్ని సిలువకు అప్పజెప్పేంత విస్తారమైన కృప.

విస్తారంగా చూపిన కృప, విమోచన క్షమాపణలను మనకు అందించింది.

దేవుని కృప అర్థం కావాలంటే ఈ ఉదాహరణ కూడా సరిపోదు కానీ, కొంత వరకు అర్థం చేసుకోడానికి వీలవుతుంది.

నేను ఒక వ్యక్తిని చంపాననుకోండి, ఆ వ్యక్తి తండ్రి నన్ను చంపడం, ప్రతీకారం. అతడు నన్ను కోర్టుకీడ్చి జైలు శిక్ష వేయించడం, న్యాయం. కానీ, ఆయన వచ్చి, నిన్ను క్షమిస్తున్నాను అనడం క్షమాపణ. నన్ను తన ఇంటికి పిలిచి తన కొడుకు స్థానం నాకివ్వడం కృప.

నేను ఆయన కోపానికి, శిక్షకు అర్హుడను ఆయన ప్రేమకు కాదు. కానీ అర్హత లేని నాకు అర్హతనిచ్చి కొడుకుగా చేసుకోవడం కృప.

సరిగ్గా దేవుని నుండి మనం అదే పాండుకున్నాం.

ఆయన కుమారున్ని మన కోసం అనుగ్రహించి మనల్ని తిరిగి తన కుమారులుగా చేసుకున్న దేవుని కృప అర్థమైతే ఎంత బాగుండో .

మన అనుదిన జీవితాల్లో ఏది కూడా ఆయన కృపకు బయట మనకు లభించదు. ఆయన కృపను దాటి మనం ఏదీ మనం పొందుకోలేము.

  1. యేసు క్రీస్తు ద్వారా తండ్రి దయచేసిన మరో ఆశీర్వాదం, దాచబడిన మర్మము బయలుపర్చడం

అంతే కాకుండా ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను (8,9).

ఏమిటా చిత్తమును గూర్చిన మర్మము ?

మర్మము అంటే రహస్య విషయం. ఇతరులకు చెప్పకుండా దాచబడే సంగతి. ఇక్కడ ఒకప్పుడు దాచబడిన సత్యము దేవుడు బయలుపర్చడం అని అర్థం. ఇదే పుస్తకములో 3 వ అధ్యాయంలో సువార్త ద్వారా యూదులు అన్యులు ఒకటయ్యే వార్తను మర్మము అని పౌలు తెలియజేస్తాడు. అంటే రక్షణ కార్యంలో దేవుడు సంకల్పించిన రహస్యాన్ని బయలుపర్చడం అని తెలుసుకోవచ్చు.

  1. చివరిగా, 10 వ లో “ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను”.

కొందరు ఈ వచనాన్ని ఒకనాడు క్రీస్తులో అందరూ రక్షించబడతారు, ఏకమౌతారు అని వివరిస్తారు. వీరిని యూనివర్సలిస్ట్స్ అంటారు. కానీ, ఇక్కడ పౌలు చెబుతున్నదేమిటంటే ” ఒకటి, విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. రెండు, పైన ఎన్నిక చేయబడినవారని స్పష్టంగా చెప్పాడు. మూడు, క్రీస్తునందు అనే మాట కేవలం విశ్వాసులకే లేఖనాల్లో వాడారు. నాలుగు, అవిశ్వాసులను గూర్చి ఇతర లేఖనాల్లో వాడినట్లు (ఫిలిప్పీ 2:10) భూమి కింద ఉన్నవారిలో అనే సాధారణ పదం ఇక్కడ వాడలేదు. (Geisler, N. L., & Rhodes, R. When Cultists Ask: A Popular Handbook: Baker Books. 1997).

మరి అర్థం ఏమిటి ? సృష్టి కూడా తన విమోచనకొరకు వేదన పడుతుంది అని రోమా 8:20-22 లో మనం చదువుతాం.

ఒకరోజు అన్నిటిని క్రీస్తులో దేవుడు సమకూరుస్తాడు. ఇప్పుడున్న పాపము, గలిబిలి పోతుంది.

మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే దైవజనుడు ఇలా అంటాడు – మహిమాన్విత ప్రభువైన యేసుక్రీస్తు అధికారం క్రింద శాంతి మరియు ఐక్యత ఉండబోతుంది. అన్ని విషయాలు మరోసారి ఆయనలో ఏకమవుతాయి.

 

ఈ మాటలు మనకెలా వర్తిస్తాయి?

  1. క్రీస్తు నందే పాప క్షమాపణ. క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. నీ పాపములు విస్తారం. వాటి ఫలితం నరకం. నరకాన్ని తప్పించే మనిషి ఎవడూ లేడు.

క్రీస్తు మాత్రమే నీ పాపముల కొరకు వెల చెల్లించాడు. పాపం యొక్క శక్తి నుండి అధికారం నుండి విడుదల చేయడానికి తన రక్తం అర్పించాడు.

రక్షించబడ్డావా ? ఇదే రక్షణ దినం. యేసు క్రీస్తును నమ్ముకో.

2.క్రీస్తు విమోచనా కార్యం ద్వారా రక్షించబడిన వారలారా, క్రీస్తు కృప అనుభవిస్తున్న వారలారా, ఈ మాట వినండి.

పాపము నుండి దేవుడు నిన్ను విడిపించాడు, పాప ఫలితాల నుండి తప్పించాడు.

తిరిగి పాపమునకు దాసులు కాకండి.

క్రీస్తు రక్తమును చిందించి వెల చెల్లించాడు, నీ కళ్ళ ఎదుట నీవు చూస్తున్న వాటితో, నీ మాటలతో , ప్రవర్తనతో మాటిమాటికీ పాపం చేసి క్రీస్తు త్యాగాన్ని కించపర్చకండి.

ఎన్ని సార్లు చెప్పాలి అది పాపం అని, ఎన్ని సార్లు చెప్పాలి అలా మాట్లాడొద్దు అని, ఎన్ని సార్లు చెప్పాలి అలా ప్రవర్తించొద్దు అని.

అది కోపమైనా, ప్రేమ లేని తనమైనా, ఏదైనా సరే, ఆ పాపమును చంపడానికి ప్రయత్నం చేస్తున్నావా ? ప్రభువు దగ్గరికి ప్రతిరోజూ వెళ్లి ప్రార్థనతో ఆధారపడుతున్నావా ?

ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన్ను సేవిస్తున్నావా ?

ఈ స్టోరీ ఒక పుస్తకంలో చదివాను.

బానిసలను కొనుక్కునే సందర్భములో ఒక అందమైన అమ్మాయి కోసం యజమానులు పోటీ పడుతున్నారు. వారిలో ఒక క్రూరుడైన యజమాని ఉన్నాడట. ఆమెను కొనుక్కొని బానిసగా తీసుకెళ్లాలని అతని ప్లాన్. ఆయన ఆ అమ్మాయి కోసం డబ్బు చెబుతుంటే ఆ అమ్మాయికి భయం భయంగా అనిపించేదట. కానీ, అక్కడే ఉన్న మరో మంచి యజమాని ఈ క్రూరుడైన యజమాని కంటే ఎక్కువ వేళా చెల్లించి ఆ అమ్మాయిని కొనుక్కున్నాడు. ఆ అమ్మాయి ఆ యజమానిని మెల్లిగా వెంబడిస్తుంటే, ఆయన తిరిగి ” నేను నిన్ను నా దాసిగా ఉండడానికి కాదు నీకు బానిసత్వం నుండి విడిపించడానికి వెల చెల్లించాను” అన్నాడట. ఆ అమ్మాయి అక్కడే మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ” ఎందుకు విడిపించావు ? ” అని అడిగి ” ఇకనుండి నేను నీకు సేవ చేస్తాను ” అని చెప్పిందట.

అంటే అర్థం – ఆయన నీ కొరకు మరణించాడు, వెల చెల్లించాడు. ఇప్పుడు ఆయనను ఇష్టపూర్వకంగా,స్వచ్చందంగా సేవించే క్రైస్తవులుగా మనం ఉండాలి.

13 మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని విశ్వసించిన వారిని ఆత్మచేత ముద్రించాడు. ఈ వాగ్దానము ముందుగానే చేశాడు.

యెషయా 44:3 – నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

యెహెఙ్కేలు 11:19 – ​వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.

లూకా 24:49 -ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.

పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన ప్రభువు వాగ్దానము ప్రకారం వచ్చాడు ఆ పిదప అపొస్తలుల కార్యముల గ్రంథంలో నుండి ఆయన చేసిన కార్యాలు మనం చదువుతాం.

అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన దేహాలను ఆలయముగా చేసుకొని జీవిస్తున్నాడు (1 కొరింథీ 6:19). ఎలా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నాం ?

క్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా పొందుకున్నాము.

ఎప్పుడు ఆత్మ చేత ముద్రించబడ్డాము ? యేసు ప్రభువుని విశ్వసించిన క్షణం లోనే. 

ముద్రించబడడం అనేది 4 విషయాలను చెబుతుందని ESV కామెంటరీలో చెప్పబడింది. 1. భద్రత 2. ధ్రువీకరణ 3. యదార్థత 4. యాజమాన్యం యొక్క గుర్తింపు.

ఇది భద్రపర్చడం అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత తన దేహాన్ని సమాధిలో భద్రపరిచిన తర్వాత ఆ సమాధికి రోమా ప్రభుత్వం వారు రోమన్ సీల్ వేశారు. ఆత్మ దేవుడు కూడా మన రక్షణను భద్రపరిచాడు.

నా దగ్గరికి గ్రీన్ ఇంక్ తో సంతకం కోసం వస్తారు. సంతకం కింద నేను స్టాంప్ వేయాలి. ఆ స్టాంప్ ఉంటేనే ఆ సంతకానికి లేదా సర్టిఫికెట్ కి విలువ. అంతే కాదు, ఆ స్టాంప్ వేస్తే దానిని నేను ఆమోదిస్తున్నట్లు, ఆ పత్రం సరైనదే అని ధృవీకరిస్తున్నట్లు.

దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చేసింది కూడా ఇలాంటిదే.

తన ఆత్మ చేత ముద్రించిన వారిని నిజమైన విశ్వాసులు అని ధ్రువీకరించడం లాంటిది.

ఈ నాలుగిట్లో యజమానత్వం అనేది ఇక్కడ సందర్భంలో మనకు కనిపిస్తుంది. దేవుడు తన ప్రజలను ఎన్నుకొని,రక్షించి, తన ఆత్మ ద్వారా ముద్రించి వారిపై తన యజమానత్వం ప్రదర్శించినట్లు అర్థం అవుతుంది.

ఆయన పిల్లల మీద ఆయన ఆత్మ ముద్ర ఉన్నది. ఆయన యజమానిగా ఉన్నాడు.

రెండవదిగా, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని పౌలు చెబుతున్నాడు. అంటే guarantee గా ఉన్నాడు.

గ్రీకులో ఈ పదానికి “ఎంగేజ్మెంట్ రింగ్” అని అర్థం.  “ప్రస్తుతానికి దీన్ని తీసుకోండి, ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి” అని చెప్పే వాగ్దానానికి చిహ్నంగా వాడేవారు.

“పని పూర్తిగా చేసిన తర్వాత పూర్తి చెల్లింపు జరుగుతుందనే అంచనాతో పని చేసే వ్యక్తికి ముందుగా డౌన్ పేమెంట్ ఇవ్వబడుతుంది.”

ESV ఎక్స్‌పోజిటరీ కామెంటరీ: ఎఫెసియన్స్–ఫిలేమోన్

క్రాస్ వే.

మనం ఇల్లు బుక్ చేసుకోడానికి, కార్ బుక్ చేసుకోడానికి ముందు ఇచ్చే డబ్బును డౌన్ పేమెంట్ అంటారు.

అదే విధంగా దేవుడు తన ఆత్మను పంపి మనలను ముద్రించుట ద్వారా డౌన్ పేమెంట్ చెల్లించాడు.

ఎప్పటి వరకు ? సంపూర్ణ విమోచన దినము వరకు – ఎఫెసీ 4:30 – విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.

దేవుడు మనల్ని విమోచించాడు కానీ సపూర్ణంగా విమోచించబోతున్నాడు. అది ఇంకా గొప్ప ఆశీర్వాదం

దేవుడు ఒకసారి ముద్రించాడంటే, రక్షించాడంటే, విమోచించాడంటే తిరిగి వెనక్కి తీసుకోడు.

అన్వయింపు :

  1. ఆత్మ చేత ముద్రించబడడం ఆంటే ఆయన మన యజమానుడని అర్థం. ఆయన అధీనంలో ఉండాలని అర్థం. అంటే మనం మనకు ఇష్టం వచ్చినట్లు కాకుండా ఆయన అధీనంలో ఉండడం గూర్చి ఇక్కడ చెప్పబడింది.

ఆయనకు దుఃఖపరిచే పాపములు చేయకూడదని అర్థం.

  1. రెండవదిగా, ఆయన చేతిలో ముద్రించబడి భద్రం చేయబడిన వారమైన మనలను ఆయన చేతి నుండి తీసుకునేవారెవరూ లేరు. అంటే మనం మన రక్షణను కోల్పోయే అవకాశం లేనేలేదు.

రక్షణను కోల్పోయే అవకాశం లేదు కాబట్టి ఇష్తమొచ్చినట్లు బ్రతకడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించలేదు.

లోకానికి వేరుగా పవిత్రంగా,నిర్దోషులుగా ఆయన అధికారానికి లోబడి బ్రతకడానికి రక్షించాడని మర్చిపోవద్దు.

  1. మూడవదిగా, దేవుణ్ణి మహిమపరచడం మరియు ఆయనను శాశ్వతంగా ఆస్వాదించడం మనిషి యొక్క ప్రధాన ముగింపు కాబట్టి, మీరు ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి ఆయన మీకు ఇచ్చిన రక్షణలో మీరు సురక్షితంగా సేదతీరాలి.

కాబట్టి, మీ మోక్షాన్ని భద్రపరిచిన దేవుని బహుమతి పరిశుద్ధాత్మలో ఆనందించండి!

దేవుడు జగత్తు పునాదికి ముందే తన ప్రజలను ఎన్నుకున్నాడు, కుమారుడు ఆ ప్రజల నిమిత్తం రక్తం చిందించి ప్రాయశ్చిత్త వెల చెల్లించాడు, పరిశుద్దాత్మ దేవుడు సంచకరువుగా మనల్ని ముంద్రించాడు.

రక్షణలో త్రియేక దేవుని కార్యం.

ఈ మాట చెప్పి ముగిస్తాను. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడు. ఎన్నుకున్నాడు, పిల్లలుగా చేసుకున్నాడు, క్రీస్తును విమోచనగా పంపించాడు, ఆత్మతో ముద్రించాడు. ఇప్పుడు 3 వచనం చూడండి.

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక.

ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఇన్ని ఆశీర్వాదాలు ఉచితంగా ఇచ్చినందుకు స్తుతించాలి.

ఎప్పుడు స్తుతించాలి ? కేవలం ఆదివారం మాత్రమే కాదు, జీవిత కాలమంత స్తుతించాలి. మరో విషయం ఇవన్నీ మనం భౌతికంగా చనిపోయిన తర్వాత దేవుడు మనకు ఇవ్వబోయేవి కాదు. ఇక్కడే మనకు దయచేసినవి కాబట్టి, ఇక్కడే స్తుతించాలి.

ఎలా స్తుతించాలి ? ఆయనకు కృతఙ్ఞతలు చెల్లిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ స్తుతించాలి.