సంఘ క్షేమం కొరకు సంఘము చేయాల్సిన ప్రార్థన (ఎఫెసీ 1:15-23)
I . విశ్వాసుల విశ్వాసం మరియు ప్రేమ కొరకు కృతఙ్ఞతలు (THANKSGIVING)
II . సంఘము గురించిన ప్రార్థన (INTERCESSION)
i ) దేవుని పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోడానికి ప్రార్థన
ii ) పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో తెలుసుకోడానికి ప్రార్థన
iii ) విశ్వాసులలో దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో తెలుసుకోడానికి ప్రార్థన
1:1-14 వచనాలలో ప్రజలు తండ్రియైన దేవుని ఏర్పాటు చేయబడి, కుమారుడైన క్రీస్తు విమోచనా కార్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి రక్షించబడతారు, వారు విశ్వాసులు మరియు పరిశుద్ధులు అని మనం నేర్చుకున్నాం.
ఈ ఆత్మీయమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు దయచేశాడు అని తెలుసుకున్నాము.
ఈ వారం పౌలు చేసిన ప్రార్థన గురించి మనం చూడబోతున్నాం.
పౌలు కేవలం థియరీ చెప్పి వదిలేసే వాడు కాదు, ఆయన వారి కొరకు అంటే సంఘము కొరకు ప్రార్థన చేసేవాడిగా కూడా మనకు కనిపిస్తాడు.
పౌలు గొప్ప సువార్తికుడు, బోధకుడు, సంఘ స్థాపకుడు, గొప్ప రచయిత అంతే కాదు గొప్ప ప్రార్థనా పరుడు కూడా.
ఇతర పుస్తకాల్లో కూడా సంఘము కొరకు చేసిన ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. ఫిలిప్పీ 1:3-11, కొలస్సీ 1:3-4,9-12 చూస్తే మనకు అర్థమవుతుంది.
ఈ వచనాలు తెలుగులో విభజించడం కొంచెం కష్టం అయ్యింది. ఎందుకంటే ఇవి గ్రీకులో పెద్ద వాక్యం. ఇంగ్లీష్లో చక్కగా అమర్చబడింది కూడా. నేను esv కామెంటరీ చేసిన విభజనను తీసుకొని మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను.
I . విశ్వాసుల విశ్వాసం మరియు ప్రేమ కొరకు కృతఙ్ఞతలు
15 ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాస మునుగూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, నేను వినినప్పటినుండి 16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
కొలస్సీ 1:3 – పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,
మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను – అంటే, 24 గంటలు ప్రార్థన చేయడం అని అర్థం కాదు గానీ, క్రమంగా వారి కొరకు ప్రార్థిస్తున్నాడు అని అర్థం.
ఈ హేతువు చేత అంటే పైన చెప్పబడిన విషయాల చేత అని అర్థం. రక్షణలో త్రియేక దేవుని కార్యమును బట్టి విశ్వాసుల విశ్వాసం ప్రేమ గురించి దేవునికి కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాడు.
ఇక్కడ విశ్వాసం అంటే క్రీస్తు నందు వారు ఉంచిన విశ్వాసం. ఆ ఎఫెసు పట్టణంలో అర్తిమయ దేవతను ఆరాధించే వారు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యందు వారి పాప క్షమాపణ కొరకు విశ్వాసం ఉంచారు. ప్రారంభ ప్రసంగంలో ఎఫెసులో పౌలు పరిచర్య చేసినపుడు ఏమి జరిగిందో నేను వివరించాను.
అపొస్త 19 వ అధ్యాయంలో దేమేత్రియ అనే కంసాలి పౌలు సువార్త చెప్పినపుడు చాలా మంది ఆ సువార్త యందు విశ్వాసం ఉంచడం వల్ల అర్తెమి దేవికి వెండి గుళ్లను చేసే తన వ్యాపారం పడిపోవడం చూసి అందరినీ సమకూర్చి పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అక్కడున్న అందరూ ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని అరిచారు ఆ పట్టణమంతా గలిబిలిగా అయింది.
అక్కడున్న కరణము అందర్నీ సముదాయించి వీరు గుడి దోచినవారు కారు,ఈ దేవతను దూషింపలేదు. మీకు ఏదైనా సమస్య ఉంటె న్యాయ సభలో పరిష్కారం చేసుకోండి అని అక్కడ సభను ముగించాడు.
అక్కడ చాలా అల్లరి చెలరేగింది. అంటే సువార్త నమ్ముకోవడం కష్టమే అయ్యుండొచ్చు.
అలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో సైతం ఎఫెసులో ప్రజలు యేసునందు విశ్వాసం ఉంచారు.
ఇది మంచి నేలలో పడిన విత్తనం లాంటిది. శ్రమలు, వ్యతిరేకత వారి విశ్వాసాన్ని ఆపలేకపోయాయి.
ఈ విశ్వాసం కేవలం జ్ఞానయుక్తమైనది కాదు. క్రీస్తును అనుభవ పూర్వకముగా తెలుసుకుని విశ్వసించిన సంఘము.
ఎవరిచ్చారు ఈ విశ్వాసాన్ని వారికి ? దేవుడే ఇచ్చాడు.
అందుకే దేవునికి పౌలు కృతఙ్ఞతలు చెబుతున్నాడు.
ఎవరైనా ఎక్కడైనా ప్రభువును నమ్ముకున్నారని తెలిసినపుడు ప్రభువు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించడం మనం ఇక్కడ నేర్చుకోవచ్చు.
ఇక్కడ ఒక ప్రశ్న : మీ కాపరి విశ్వాసుల విశ్వాసం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడా ?
ఆయన కోసం ప్రభువును విశ్వసించమని ఇక్కడ అర్థం కాదు, కానీ మీ ఆత్మలను కాచే బాధ్యత గల కాపరి మీరు ప్రభువుని నమ్ముకొని జీవించడం చూసి ప్రభువుకి కృతఙ్ఞతలు చెప్పగలుగుతున్నాడా ?
రెండవది, పరిశుద్ధులయెడల మీరు చూపిస్తున్న ప్రేమను గూర్చి – ఈ విశ్వాసులు కేవలం ప్రభువును నమ్ముకొని సంతృప్తి చెందలేరు. ఇతరులను ప్రేమించారు.
ఎందుకంటే మొదట వారు దేవుని ప్రేమను ఎన్నికలో,క్రీస్తు కార్యములో,పరిశుద్ధాత్మ ముద్రణలో అనుభవించారు.
ఉగ్రతా పాత్రులను దేవుని పిల్లలుగా చేసిన ప్రేమను అనుభవించారు. అందుకే ఇతరులను ప్రేమించడం స్వాభావికంగా చేశారు.
వీరికి మార్కు 12:31 తెలియదు ఎందుకంటే ఇంకా అప్పటికి ఆ సువార్త రాయబడలేదు. పాత నిబంధన వాక్యాన్ని విన్నారు కావొచ్చు.
విశ్వాసుల మధ్య ప్రేమను బట్టి కాపరి దేవునికి కృతఙ్ఞతలు చెల్లించే సంఘము, వాక్యానుసారమైన సంఘము.
ఇక్కడ ఒక ప్రశ్న : మీ సంఘ కాపరి మీ మధ్య ప్రేమను బట్టి ( తనను సంఘం ఎలా ప్రేమిస్తుందో అనే విషయాన్ని బట్టి కాదు ) దేవునికి కృతజ్ఞత చెల్లించగల్గుతున్నాడా ?
ఒకవేళ మీ కాపరి ఆలా చేయాలంటే, మీరు ప్రేమను ఇతరుల పట్ల చూపిస్తున్నారా ? అంటే స్వార్థ పూరిత జీవితం జీవించకుండా ఇతరుల గురించి ఆలోచన చేస్తున్నారా ? ప్రార్తిస్తున్నారా ?
వారెన్ వియర్స్ బి : క్రైస్తవ జీవితం రెండు కోణాలను కలిగియుంటుంది. ఒకటి దేవునియందు విశ్వాసం (VERTICAL), రెండవది విశ్వాసుల పట్ల ప్రేమ (HORIZONTAL).
సంఘస్తుల పట్ల ప్రేమ కలిగి లేకుండా, నాకు దేవునిపై విశ్వాసం ఉన్నాడని అనకూడదు.
II . సంఘము గురించిన ప్రార్థన
మొదటగా సంఘము గురించి దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాడు, ఆ పిదప సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు.
కాపరి ప్రధాన పరిచర్యలో ఒక పరిచర్య సంఘము కొరకు ప్రార్థన చేయడం.
ఎందుకంటే, సంఘ పరిచర్య చాలా ప్రాముఖ్యమైన, చాలా ఒత్తిడితో కూడుకున్న పరిచర్య. ప్రజలను ప్రభువు కొరకు నిలబెట్టాలంటే, ప్రభువు మార్గంలో నడిపించాలంటే కాపరి సొంత శక్తి, జ్ఞానం వలన కాదు. దేవుని శక్తి, దేవుడిచ్చే జ్ఞానం వలన మాత్రమే సాధ్యం కాబట్టి, దేవునికి సంఘము కొరకు ప్రార్థన చేయబద్ధుడై ఉన్నాడు.
ఇక్కడ, విశ్వాసులు ఇతర విశ్వాసుల కొరకు చేయాల్సిన ప్రార్థనగా కూడా ఈ ప్రార్థనను మనం అర్థం చేసుకోవచ్చు.
సంఘములో ఉంటూ సంఘ క్షేమం కొరకు మనమేదైనా చేయాలంటే వాటిలో ఒక ప్రాముఖ్యమైన సంగతి : ప్రార్థన
ఏమిటి ప్రార్థన అంశాలు ?
17 that the God of our Lord Jesus Christ, the Father of glory, may give you the Spirit of wisdom and of revelation in the knowledge of him,
తెలుగులో ఆత్మ ద్వారా జ్ఞానమును మరియు ప్రత్యక్షత గల మనసును అని తర్జూమా చేయాలి కానీ ఇక్కడ ఆత్మ అనే పదం translators వాడలేరు.
యెషయా 11:2 -యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును
జ్ఞానం అనేది కేవలం మెదడులో ఉంచుకునే జ్ఞానం మాత్రమే కాదు కానీ మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే జ్ఞానం.
జ్ఞానం అనేది ఒక వ్యక్తి యొక్క రోజువారీ జీవితంలో నేర్చుకున్న సత్యాలను ఎలా అన్వయించాలో తెలుసుకోవడం.
జ్ఞానం అంటే మనకున్న అవగాహన ఆధారంగా సరైన తీర్పు ఇవ్వగల సామర్థ్యం కలిగియుండడం మరియు సరైన క్రియలు చేయడం.
జ్ఞానము అంటే – దేవుని గూర్చిన జ్ఞానము. దేవుడెవరో అనే అంశంపై అవగాహన. అది లేకుండానే వారు విశ్వాసులు అయ్యారా అనే ప్రశ్న రావొచ్చు.
వారికి పూర్తిగా అవగాహన లేదని ఇక్కడ అర్థం కాదు, దేవుని గూర్చిన ఇంకా లోతైన జ్ఞానమును వారు తెలుసుకోవాలని ప్రార్థనగా అర్థం చేసుకోవాలి.
రక్షించబడినపుడు ఉన్న దేవుని పట్ల జ్ఞానము రోజు రోజుకూ పెరుగుతూ ఉండాలని ప్రార్థన.
దేవుని సత్యాలను ఆజ్ఞలను ఎలా జీవితానికి అన్వయించుకోవాలో తెలుసుకోవడం జ్ఞానం. వాటిని దేవునికి మహిమకరంగా చేయడం జ్ఞానం.
ప్రత్యక్షత గల మనసు – పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు దేవుని గూర్చిన ప్రత్యక్షత నిచ్చి రక్షణలో వారు కొనసాగడానికి మనసును ఇవ్వడం.
9,10 వచనాలలో తన చిత్తమును గూర్చిన మర్మము క్రీస్తులో విశ్వాసులకు బయలుపరచబడింది. ఇప్పుడు విశ్వాసులు ఆ మర్మములోని లోతైన సంగతులు అర్థం చేసుకోవాలి.
ఈ రెండు కూడా ” తనను తెలుసుకోడానికి ” అని రాయబడింది అంటే దేవుణ్ణి ఇంకా ఇంకా తెలుసుకోడానికి అని అర్థం.
2. దేవుడు తన ప్రజలు ఏమి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడో వాటి గూర్చిన ప్రార్థన.
ఇక్కడ మూడు సంగతులను పౌలు ప్రస్తావిస్తున్నారు.
ఇక్కడ పిలుపు అంటే పరిచర్యకు పిలుపు కాదు. సువార్త ద్వారా రక్షణ నిమిత్తమైన పిలుపు. ఆ రక్షణ ఎటువంటి నిరీక్షణ విశ్వాసులకు ఇచ్చిందో విశ్వాసులు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు.
ఏమిటా నిరీక్షణ ?
క్రైస్తవ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు, క్రైస్తవ నిరీక్షణ ఎంతో ఆనందకరమైనది. ఎందుకంటే ఆ నిరీక్షణలో క్రీస్తుతో నిత్య సహవాసం ఉండబోతుంది.
1 యోహాను 3;2,3 : ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.
ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
ఆయనతో సదాకాలము ఉండబోతున్నాం. సంపూర్ణ నీతితో బ్రతకబోతున్నాం. పాపం లేని కొత్త సృష్టిలో జీవించబోతున్నాం.
కాబట్టి ఇతరులకొరకు ప్రార్థన చేయండి. విశ్వాసులు ఈ విధమైన వైఖరి కలిగి ప్రభువు కొరకు జీవించడానికి వారి కొరకు ప్రార్థన చేయండి.
పరిశుద్ధులు అంటే విశ్వాసులందరూ అని అర్థం.
ఈ వచనాన్ని రెండు రకాలుగా అర్థ వివరణ చేశారు.
మొదటిగా, దేవుని నుండి కలిగిన వారసత్వ మహిమ యొక్క ఐశ్వర్యం పరిశుద్ధుల మధ్య ఆనందించబడటం. అంటే ఆయన మనకిచ్చిన ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ తెలుసుకొని అనుభవించాలని ప్రార్థన చేయడం.
కొలస్సి 1:12 లో ఇదే అర్థాన్నిచ్చే వచనం మనము చూస్తాం. “తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము”.
1 పేతురు 1:4 – మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు,
రెండవ అర్థ వివరణ ఏమిటంటే, దేవుడు తన ప్రజలలో కలిగియున్న స్వాస్థ్యము యొక్క ఐశ్వర్యము. పైన ప్రజలు ఆయనలో కలిగియున్న స్వాస్థ్యము, ఇక్కడ దేవుడు విశ్వాసులలో కలిగియున్న స్వాస్థ్యము. మనము దేవుని స్వాస్థ్యము, క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన స్వాస్థ్యము. ఈ విధంగా మనం దేవుని ఐశ్వర్యంగా ఉంటాము, ఆయన మనలను చివరివరకు శాశ్వతంగా కలిగి ఉంటారు.
ద్వితియో 32:9 -యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.
కీర్తనలు 33:12 -యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.
ఈ రెండూ కూడా సత్యాలే. విశ్వాసులుగా ఆయనను స్వాస్థ్యముగా కలిగియుండడం, దేవుడు మనల్ని స్వాస్థ్యముగా కలిగియుండడం ధన్యతలే.
ఆ ధన్యతలను బట్టి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి.
దేవుడు మిమ్మల్ని విలువైన వారిగా తన స్వకీయ సంపాద్యముగా చేశాడని వారికి ప్రోత్సాహం ఇచ్చి ప్రార్థన చేయండి.
ఎంత గొప్పది దేవుని శక్తి ?
20-22 వచనాలు గమనిద్దాం.
దేవుని శక్తి, క్రీస్తును మృతులలో నుండి పునరుత్తానుడిగా లేపింది.
దేవుని శక్తి, క్రీస్తును అన్నింటి పైన అధికారిగా నియమించింది.
దేవుని శక్తి, క్రీస్తును తండ్రి కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టింది.
దేవుని శక్తి. క్రీస్తును సంఘానికి శిరస్సుగా నియమించింది.
ఇదే శక్తి, విశ్వాసులకు ఇవ్వబడింది. యేసుక్రీస్తు ద్వారా మనలను రక్షించింది, యేసుక్రీస్తును విశ్వసించిన ప్రజలలో గలది.
క్రీస్తును మరణం నుండి లేపిన శక్తి.
ఎప్పుడైనా ఆలోచించారా ? రక్షించిన ప్రజలు సామాన్యమైనవారు కారు. వాళ్ళు దేవుని శక్తి చేత నింపబడినవారు. స్వశక్తి కాదు సర్వోన్నతుడైన దేవుని శక్తి నీలో ఉంది నాలో ఉంది.
మీరు శక్తి గలవారు అని ఇతరులను ప్రోత్సహించండి. దేవుని శక్తి మీలో ఉంది నిరుత్సాహపడకండి అని వారిని ఉత్తేజపరచండి. వారి కోసం ప్రార్థన చేయండి.
Application :
కేవలం 10 నిముషాలు పడుతుంది ఆ ప్రార్థన విన్నపాలు చేయడానికి. వాటికి కూడా సమయం లేదు అనడం దారుణం.
నీ ప్రేమ ప్రార్థనతో మొదలవ్వాలి, ప్రార్థనతో కొనసాగాలి.
ఆతిథ్యం ఇవ్వడం ప్రేమలో ఒక భాగం. కానీ ఆతిథ్యంలో జరగాల్సింది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కష్టాలు పంచుకోవడం, ప్రార్థన చేయడం. లేకపోతె ఆ ఆతిథ్యానికి, సోషల్ క్లబ్ మీటింగ్ కి పెద్ద తేడా ఉండదు.
i ) జ్వరం, దగ్గు, జలుబు, బలహీనత ఇవి ప్రాముఖ్యంగా ఉండాల్సినవి కావు. వీటి గురించి ప్రార్థన చేయకూడదు అని నేను చెప్పట్లేదు. కానీ, సంఘములో గల సభ్యులు దేవుని జ్ఞానములో, ప్రత్యక్షత గల మనసు కలిగి దేవునిలో ఎదగడానికి ప్రార్థన చేయాలి.
గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి వాక్య జ్ఞానంలో ఎదగాలి.
ఎవరైనా బైబిల్ చదవడంలో, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే వారికి సహాయం చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి.
సంఘములో నీకున్న బైబిల్ జ్ఞానమును బట్టి ఉప్పొంగక, మెల్లిగా వాక్యం నేర్చుకుంటున్నవారికి దేవుడు సహాయం చేయాలని ప్రభువు సన్నిధిలో వారి గురించి ప్రార్థన చేసే క్రైస్తవులు సంఘములో కావాలి.
ii ) యేసుక్రీస్తును విశ్వసించని సమయంలో నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నాము. ప్రభువును విశ్వసించాక నిరీక్షణ కల్గిన వారిగా మార్చబడ్డాము. కానీ కొందరు క్రైస్తవులు సంఘములో ఇంకా నిరీక్షణ లేని ప్రజలుగా ఉంటారు.
ఉదాహరణకు, ఏదైనా గొప్ప కష్టం వచ్చినపుడు దేవున్ని ప్రశ్నిస్తుంటారు లేదా గొణుగుతుంటారు. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. కొందరు విశ్వాసంలో ఇంకా స్థిరంగా ఉండరు. ప్రోత్సాహం ఇవ్వాలి మరియు ప్రార్థన చేయాలి.
కొన్ని సార్లు మనకు కూడా ఇదంతా నిజమేనా అని సందేహాలు రావొచ్చు. సంఘముతో మన ప్రార్థనా విన్నపాలు పంచుకుంటే, సంఘము మన కొరకు ప్రార్థన చేస్తారు.
iii ) క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యము ఐశ్వర్యము గొప్పది. ఆయన కుమారున్నే మనకు అనుగ్రహించిన దేవుడు. తన కుమారులుగా, కుమార్తెలుగా ఆధిక్యత నిచ్చాడు. ఆయన వారసులు అనే ఆశీర్వాదం ఇచ్చాడు.
సంఘములో దేవుడు ఇచ్చిన రక్షణ సంబంధ ఆశీర్వాదాలను అనుభవిస్తూ, వస్తు సంబంధ, లోక సంబంధ ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వకపోవడం లేదా ఇచ్చే సమయం కాస్త ఆలస్యం అవ్వడం వలన చింతించే క్రైస్తవుల కొరకు మనం ప్రార్థన చేయాలి.
ఉదా : నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉద్యోగం కోసం చాలా ప్రయత్నం చేసాడు. అన్న, ఇంకా జాబ్ రావట్లేదు అని బాధపడేవాడు. ప్రయత్నం చేయి తమ్ముడు అని చెప్పి క్రమంగా ఆయన గురించి ప్రార్థన చేశాము. ఆ తర్వాత చాలా రోజులకు ఉద్యోగం వచ్చింది.
పిల్లలు లేరు అని బాధపడొద్దు, సొంత ఇల్లు లేదని చింతించొద్దు, పెద్ద జీతం లేదని పెద్దగా ఏడవొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అని చెప్పటమే కాదు. వారికి ఆ విశ్వాసం దేవుడు దయచేయడానికి ప్రార్థన చేయాలి.
iv) 2పేతురు 1:2 -మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున,
మన క్రైస్తవ జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలకు కావాల్సిన దైవశక్తిని దేవుడు ఆల్రెడీ మనకు దయచేశాడు.
ఇప్పుడు ఆ శక్తిని ఉపయోగించుకొని ఆయనపై ఆధారపడుతూ జీవించాల్సిన బాధ్యత మనది.
సంఘములో పాపమును జయించలేని, పాపముతో పోరాడే క్రైస్తవులు ఉంటారు. దేవుడు వారికిచ్చిన శక్తిని సరిగా వినియోగించుకోవడంలో ఇబ్బంది పడుతూ, అవగాహన లేకుండా ఉంటారు.
క్రీస్తును మరణం నుండి లేపిన శక్తిని దేవుడు మనకిచ్చాడు అలాంటిది మనం పాపముతో పోరాటంలో జయించలేమా ? జయించగలం.
సంపూర్ణంగా పాప శోధన నుండి విడుదల పొందకపోయినా, పాపం నుండి ఇక్కడ విడిపించబడడానికి దేవుని శక్తి ఇవ్వబడింది.
యోసేపు పోతీఫరు భార్య నుండి పారిపోయినపుడు దేవుని శక్తి పనిచేసింది. పారిపోవడం పిరికితనం కాదు, దేవునిలోని బలం.
సంఘములో అటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని శక్తితో వారు పాపం అధిగమించడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయాలి.
ఇతరుల గురించి ప్రార్థన చేసేటప్పుడు వాళ్లలో తప్పులని చూసి, విమర్శనా దృక్పథంతో తీర్పు తీర్చే విధంగా ప్రార్థన చేయకుండా చూసుకోవాలి.
కొన్ని సార్లు మన ప్రార్థన ద్వారా కూడా ప్రజలను తీర్పు తీర్చే అవకాశం ఉంటుంది.
వారి బలహీనతలను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు మన హృదయాలను కూడా పరీక్షించుకోవాలి.
కొన్ని సార్లు ఒకరి గురించి ప్రార్థన చేసేప్పుడు, ఆ విన్నపం నాకు కూడా వర్తిస్తే దేవా నాక్కూడా సహాయం చేయి దేవా అని ప్రార్థన చేస్తాను.
1892లో జాన్ హైడ్ అనే భక్తుడు న్యూయార్క్ నుండి ఇండియాకి షిప్పులో వచ్చాడు. భారతీయులకు సువార్త చెప్పాలనే ఉద్దేశ్యంతో వచ్చి ఆ తరువాత 20 యేళ్లు ఇక్కడే ఉన్నాడు. ఆయనకు గల పేరు ” ప్రార్థించే హైడ్”. ఎందుకంటే గంటల తరబడి అవిశ్వాసులు ప్రభువును నమ్ముకోవాలని, విశ్వాసులు ప్రభువులో ఉజ్జీవం పొందుకోవాలని ప్రార్థన చేసేవాడట.
ఒకసారి, ఆత్మీయంగా చల్లబడిపోయిన ఒక పాస్టర్ గురించి ప్రార్థన చేస్తుండగా అకస్మాత్తుగా ఆగిపోయాడట. ఆ వ్యక్తిని తీర్పు తీర్చే విధంగా ప్రార్థన చేయబోతున్నానని అనిపించి, ఆయన్ను కూడా ప్రభువు ప్రేమిస్తున్నాడని, ఆ పాస్టర్ గారి మంచి పనుల గూర్చి ప్రార్థన చేసాడట. ఆ తర్వాత దాదాపు అదే కాలంలో ఆ పాస్టర్ గారు తిరిగి ప్రభువులో తీవ్రమైన ఆశలో ఎదగడం గమనించాడట.
(https://www.preceptaustin.org/ephesians_sermon_illustrations_1)
పౌలు మరో విషయం కొలస్సి 1:29లో – అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. అంటే దేవుడిచ్చిన శక్తిని బట్టి పరిచర్యలో ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను అని అర్థం.
ప్రభువు కోసం పని చేయడానికి దేవుని శక్తి దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ప్రయత్నం ప్రయాసం.
సంఘములో అటువంటి పరిపక్వత గల విశ్వాసులు ఉండడం ఆ సంఘముకు క్షేమం.
ప్రయాస పడుతున్నావా ? నేను బలహీనుడను, ఇది నా పని కాదు, నేను చేయలేను అని కారణాలు చెప్పి తప్పించుకుంటున్నావా ?
ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. సంఘముతో పంచుకో, సంఘం ప్రార్థన చేస్తుంది.
ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం: సంఘము వీటన్నిటి గురించి ప్రార్థన చేయాలంటే, నువ్వు సంఘముతో ఈ విషయాలు పంచుకోవాలి. నీ ప్రతి పాపం సంఘమంతటితో ఒప్పుకోమని నేను చెప్పట్లేదు కానీ, దేవునిలో ఎదగడానికి, దేవునిలో ఇంకా విశ్వాసం ఉంచడానికి, ప్రార్థనలో ఎదగడానికి, ఆత్మీయ విషయాల విషయం వీటి గురించి పంచుకోవాలి.